'చందమామ చదివిన బాల్యం నాది' అని అంటాడో రచయిత గర్వంగా. నిజమే. కాని ఆయనొక్కడిదేనా... అందరిదీ అట్లాంటి బాల్యమే. అందరమూ అలా గర్వంగా ఫీలయ్యేవాళ్లమే.
అంబాడే రాముడికోసం అద్దంలోకి చంద్రుణ్ణి దించినట్టు -
అక్షరాల్లోకి వెన్నెల్ని ఒంపుకొచ్చారు వాళ్ళిద్దరూ - మన పిల్లలకోసం....పెద్దాళ్లమైన మనలోపలి పిల్లలకోసమూనూ.
పసిమెదళ్లకి రెక్కలు కట్టి - ఎక్కడెక్కడి మబ్బుల దర్బార్లవెంటో తిప్పుకొచ్చారు. ఏ సప్త సముద్రాల ఆవలికో ఎగరేసుకుపోయారు.
ఆ ఇద్దరు 'చందమామ'లు నాగిరెడ్డి - చక్రపాణి... కొన్నేళ్ల క్రితమే చక్రపాణి కన్నుమూశారు. 92 ఏళ్ల వయసులో నాగిరెడ్డి మొన్న పిబ్రవరి 25న మనందర్నీ వదిలేసి వెళ్లిపోయారు - తన స్నేహితుణ్ణి వెతుక్కుంటూ.
ఈ దేశపు పిల్లలూ, పెద్దాళ్లయినవాళ్లూ - అంతా... అంతా... వాళ్లిద్దరికీ రుణపడి వున్నవాళ్లే.
తెలుగు సిన్మాకి నాగిరెడ్డి పెద్దదిక్కు. ఆయన ఎన్నో హిట్లు తీసివుండవచ్చు. సినిమా చరిత్రలో తొలి పేజీలన్నీ ఆయనవే కావచ్చు. ఆసియాలోనే అతి పెద్ద స్టూడియోని నిర్మించి వుండవచ్చు. ఎన్నెన్నో గొప్ప ప్రయోగాలు చేసివుండవచ్చు.
కాని ఆయన 'చందమామ' ఆలోచన మాత్రం ఒక అద్భుతం. ఆ అక్షరాల సరస్సులో దేశంలోని అన్ని భాషల పిల్లల్ని కేరింతలు కొట్టించడం - మరీ మరీ అద్భుతం. కథల్నీ, గాధల్నీ, పురాణాల్నీ, ఇతిహాసాల్నీ, చరిత్రల్నీ, నవ్వుల్నీ, సరదాల్నీ, సైన్సునీ... ఇలా ఎన్నెన్నో మోసుకొచ్చి, పసిమెదళ్లని ఎట్లా వికసిపించేసిందని! ఈ దేశపు పిల్లలకి దక్కిన గొప్ప అదృష్టం 'చందమామ'. అందుకేే నాగిరెడ్డి గురించి చెప్పుకోవాలంటే ముందు చందమామ గురించి చెప్పుకోవాలి. ఆ తర్వాతే సినిమా గురించి. అదే మన బి.ఎన్‌కి మనమిచ్చే ఘననివాళి.
1912, డిసెంబర్ 2న జన్మించారు. బి.ఎన్‌ని కన్నఊరు కడప జిల్లా పులివెందుల సమీపంలో పొట్టెంపాడు గ్రామం. అక్కడి పొలాల్లోనే ఆయన బాల్యం గడిచింది. చదువు స్కూలు స్థాయిదాటలేదు. కారణం - 14 ఏళ్ల వయసులోనే తండ్రికి వ్యాపారంలో
సాయంగా వుండాలని మద్రాసు చేరాడు. వ్యాపారమేమో ఉల్లిపాయల ఎగుమతి. దీనికోసమే బి.ఎన్ కుటుంబం మద్రాసుకి మారింది.
అయితే బి.ఎన్‌కి పబ్లిసిటీ మీద విపరీతమైన ఉత్సాహం వుండేది. రోహిణివారి గృహలక్ష్మి, వందేమాతరం, సుమంగళి సినిమాలకు పబ్లిసిటీ బాధ్యత చేపట్టాడు. మరోవైపు నిర్మాణ వ్యవహారాల్ని కూడా గమనించాడు.
కొన్నాళ్లు బాగానే సాగింది. 1941లో రెండో ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చింది. మద్రాసు రేవుపై ఎడాపెడా బాంబులు పడ్డాయి. దాంతో నౌకల్లోని ఉల్లిపాయలన్నీ నీటిపాలై, వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. తీవ్రమైన నష్టం వచ్చింది. మరోవైపు ప్రాణభయం. దీంతోబి.ఎన్ కుటుంబం మద్రాసు విడిచి ఓరంపాడు గ్రామానికి మకాం మార్చింది.
ఏడాదిపాటు దుర్భరంగా గడిచింది. ఏం చేయలో, ఎక్కడికెళ్లాలో తెలీదు. అలాంటి సమయంలో 'భక్తపోతన' సిన్మా పబ్లిసిటీ కోసం కె.వి.రెడ్డినుంచి ఆఫర్ వచ్చింది. మకాం మళ్లీ మద్రాసుకి మారింది. అప్పుడే జెమినీవారు బాలనాగమ్మ రిలీజ్ చేస్తున్నారు. వాళ్ల పబ్లిసిటీ భారీగా వుంటుంది. భక్తపోతన పబ్లిసిటీ దానికి దీటుగా వుండాలి. బి.ఎన్ బాగా ఆలోచించి 65 అడుగుల హనుమంతుడి భారీ కటౌట్‌ని మల్లీశ్వరం జంక్షన్‌లో ఏర్పాటు చేయించాడు. అప్పట్లో అది పెద్ద ఎట్రాక్షన్. సినిమా కూడా విజయవంతమైంది. ఆ సినిమాకిగాను రూ.500 పారితోషికం వచ్చింది. దాంతోనే ఓ పాతకారు
కొనుక్కున్నాడు.
సినిమా సంపాదన స్థిరమైంది కాదు. చిన్నదో, పెద్దదో ఏదో వ్యాపారం చేయాలనుకున్నాడు బి.ఎన్.... మద్రాసులోని ఆచారప్పన్ వీధిలో ఓ చిన్న ప్రెస్‌ని కొన్నాడు. పెళ్లి పత్రికలు అచ్చేయాలన్నది ఆయన ఆలోచన. కాని ఆ ఆలోచనే భవిష్యత్తులో ఈ దేశపు పిల్లలకి ఓ బంగారు కానుకని అందిస్తుందని ఊహింలేదు. వాహినీవారు స్వర్గసీమ తీస్తున్న రోజులవి. దానికి మాటలు చక్రపాణి రాశారు. ఆ పనిమీదే వాహినీ స్టూడియోకి వచ్చారు. బి.ఎన్‌కి పరిచయమైంది అక్కడే. అప్పటికే శరత్ నవలల్ని అనువదించారు చక్రపాణి. వాటితోపాటు మరికొన్ని రచనల్ని అచ్చువేయించడానికి బి.ఎన్. ప్రెస్‌కు వచ్చారు. వారి మధ్య అలా మొలకెత్తిన స్నేహం దృఢంగా పెనవేసుకుపోయింది. రెండు కుటుంబాలు ఒకేగూటికింద చేరాయి. ఆలోచనల్లో, ఆచరణలో ఇద్దరిదీ ఒకే మనసు. స్నేహం అనే పదానికే నిర్వచనమైంది వారి బంధం. నాగిరెడ్డి - చక్రపాణి అనే పదబంధంలోని పేర్లను విడిగా ఊహించుకోలేం. 'చందమామ' ఆలోచన వారిద్దరిదీనూ. వెనువెంటనే అది కార్యరూపం దాల్చింది.
అలా 1947లో వచ్చిన 'చందమామ' పిల్లల్ని ఎంతగా ఆకట్టుకుందంటే- వెంటవెంటనే ఏకంగా పద్నాలుగు భాషల్లో వెలువడింది. యావద్దేశంలోని ఇంటింటి పత్రికగా మారిపోయింది. అంతేనా... నాలుగు భాషల్లో అంధులకోసం బ్రెయిలీ లిపిలో కూడా వెలువడింది. అక్కడితో ఆగలేదు. ఆంధ్రజ్యోతి, వనిత, విజయచిత్ర పత్రికలు... ఇలా బి.ఎన్ స్థాపించిన డాల్టన్ పబ్లికేషన్‌నుంచి చక్రపాణి సంపాదకత్వంలో వరసగా వచ్చాయి. రష్యా సహకారంతో పిల్లలకోసం 'స్ఫుత్నిక్ జూనియర్', 'జూనియర్ క్వెస్ట్' పత్రికలు కూడా వెంటవెంటనే వచ్చాయి. ఇవన్నీ ఇన్‌స్టాంట్ హిట్స్. చందమామ అయితే పిల్లలూ, పెద్దలూ అన్న తేడాల్లేకుండా అందరి జీవితాల్లో భాగంగా మారింది.
స్థూలంగా ఇదీ 'చందమామ' నేపథ్యం. మరోవైపు బి.ఎన్. సినిమా రంగంలో సాధించిన విజయాల్లో ఒక్కోదానికీ ఒక్కో చరిత్ర. ఆసియాలోనే అతిపెద్దదైన స్టూడియోగా 'వాహినీ'ని తీర్చిదిద్దడం దగ్గర్నించి - తెలుగు సినిమా ప్రతిష్ఠకి ప్రతీకలుగా నిలిచే మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మకథ, పాతాళభైరవి, షావుకారు, పెళ్లిచేసిచూడు వంటి 40 చిత్రాలతో సూపర్‌హిట్లు కొట్టడందాకా - ఎన్ని సంచలనాలని! యాభై ఏళ్ల ఆ సినీ దిగ్గజం జీవితాన్ని కొన్ని ముక్కల్లో తేల్చేయడం అసాధ్యం. ఆ ప్రయత్నం వ్యర్థం.
దాదాసాహెబ్ ఫాల్కే, రఘుపతి వెంకయ్యపురస్కారం, పద్మశ్రీ, కలైమామణి... ఇలా ఆయన్ని వెతుక్కుంటూ వచ్చిన లెక్కలేనన్ని అవార్డులు, హోదాలకంటే - పిల్లల మనసుల్లో నిలిచిపోవడాన్నే - అపురూపమైన అవార్డుగా భావించారు బి.ఎన్.

- వంశీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి