జలియన్‌ వాలా బాగ్‌

ఆమె పేరు రతన్‌ దేవి.
    ఆ రోజు రాత్రి ఆమె గుండెలవిసే రోదనతో భర్తని వెదికింది. శవాల గుట్టల

మధ్య.... రక్తాన్ని తొక్కుకుంటూ..... 1919 ఏప్రిల్‌ 13 రాత్రి.... జలియన్‌వాలా

బాగ్‌  పార్క్‌ మధ్యలో... ఆమె భయానక అనుభవాన్ని... ఆమె నోటితోనే

వినండి...


    ''.... తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినపుడు నేను దిగ్గున లేచాను. నా

గుండె నీరైపోయింది. మనసు కీడు శంకించింది. అప్పుడు నేను ఇంటి దగ్గరే

ఉన్నాను. నా భర్త వెళ్లింది జలియన్‌వాలా బాగ్‌ లోని సమావేశానికే. మాఇల్లు

బాగ్‌ దగ్గరే ఉంది.   మనసు చెదిరి, మతిపోయిన స్థితిలో, కంటికి, మంటికి

ఏకధారగా ఏడ్చుకుంటూ  నేను అక్కడికి చేరుకున్నాను. నాతో మరో ఇద్దరు

ఆడవాళ్లు వచ్చారు.


    అక్కడ నేను చూసింది శవాల గుట్టల్ని. ...ఆ పీనుగుల మధ్యే నా భర్తని

వెతుకుతున్నాను. మొదటి కుప్పని దాటాక... కనిపించింది.... ఆయన

శరీరం... అక్కడికి చేరుకోవడానికి నెత్తుటి ముద్దలైన శవాల మధ్యనించి

వెళ్లాల్సివచ్చింది నాకు.


    కాసేపటికి లాలా సుందరదాస్‌ కొడుకులిద్దరూ వచ్చారు. నా భర్త దేహాన్ని

ఇంటికి మోసుకుపోయేందుకు ఒక మంచం తెమ్మని వారికి చెప్పాను. ఆ

పిల్లలిద్దరూ వెళ్లారు. నాతోపాటు వచ్చిన ఇద్దరు ఆడవాళ్లని కూడా

పంపించేశాను. అప్పటికి రాత్రి 8గంటలైంది. కర్ఫ్యూ భయానికి ఎవ్వరూ ఇళ్లు

వదిలి బయటికి రావడం లేదు. ఆపుకోలేక వెక్కి వెక్కి రోదిస్తూ ....ఆ చీకట్లో

...నెత్తుటి మధ్య, ఆరిపోయిన ప్రాణాల మధ్య ...నేను మిగిలాను.


    మరో అర్ధగంటకి ఒక సర్దార్జీ వచ్చాడు. ఆ తర్వాత మరికొందరు వచ్చి ఆ

శవాల మధ్య ..... సన్నగా శోకాలు పెడుతూ దేవులాడారు. వాళ్లెవరో నాకు

తెలీదు. నా భర్త శవం ఉన్న చోటంతా నెత్తురుతో రొచ్చు రొచ్చుగా ఉంది. కట్టెని

కాస్త పొడి ప్రదేశంలో ఉంచేందుకు ఆ సర్దార్జీ సహాయం అడిగాను. ఆయన

తలకింద చెయ్యి పెట్టి పట్టుకున్నాడు, నేను కాళ్లు లేవనెత్తాను. మేమిద్దరం

కలిసి శవాన్ని ఒక చెక్క పలక మీదకి చేర్చాం.


    లాలా సుందర దాస్‌ కొడుకులు వచ్చే వైపుకి, నేను రాత్రి పది గంటల

వరకూ చూస్తూనే ఉన్నాను. ఎవరూ రాలేదు. ఆ తర్వాత లేచి అబ్లోవా కత్రా

వైపుకి వెళ్లాను. ఠాకూర్‌ద్వారాలో నివసించే విద్యార్థుల్ని ఎవర్నైనా నాకు

సహాయం చేయమని అడుగుదామని నా ఉద్దేశం. నేను నాలుగడుగులు

వేశానో లేదో... అంత రాత్రి వేళ నేను ఎక్కడికి వెళ్తున్నానని అక్కడ

సమీపంలోని ఇంట్లో కిటికీ దగ్గర కూర్చున్న మనిషి అడిగాడు.  నా భర్త

శవాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి ఎవర్నైనా సాయం అడుగుదామని

వెళ్తున్నానని చెప్పాను. రాత్రి 8 దాటిపోయిందని, ఇక ఆ సమయంలో ఎవరూ

సాయానికి రాకపోవచ్చని అతను చెప్పాడు. నేను కత్రా దిశగా నడిచాను.

కొంచెం ముందుకు వెళ్తే ఒక పెద్ద వయసు మనిషి హుక్కా పీలుస్తూ

కనిపించాడు. ఆ పక్కనే ఇద్దరో, ముగ్గురో... నిద్రపోతున్నారు కూడా. నేను

చేతులుజోడించి... రోదిస్తూ నా కష్టం వాళ్లకి చెప్పాను. సాయం అడిగాను. కానీ

వాళ్లుకూడా అప్పటికి రాత్రి పది దాటిందని, నాకు సాయం చేసి, పోలీసుల

తూటాలకి ఎరగా మారి దిక్కులేని చావు చచ్చేందుకు తాము సిద్ధ పడలేమని

చెప్పారు.


    నేను వెనక్కి వెళ్లి నా భర్త శవం దగ్గరే కూర్చున్నాను. హటాత్తుగా నా

చెయ్యి ఒక వెదురు కర్ర మీద పడింది. ఆ రాత్రంతా మీదకి వస్తున్న కుక్కల్ని

తరమడానికి నేను ఆ కర్రే వాడుకున్నాను. అక్కడే .... సమీపంలోనే...

ముగ్గురు మనుషులు బాధతో గిజగిజలాడటం నేను చూశాను. ఆ పక్కనే ఒక

గేదె బాధ తాళలేక గిలగిలా కొట్టుకుంటోంది. అక్కడే ...ఒక 12 సంవత్సరాల

పిల్లవాడు తట్టుకోలేని నొప్పితో ఏడుస్తున్నాడు. తనని ఒంటరిగా వదిలేసి

వెళ్లిపోవద్దని ఆ పసివాడు నన్ను పదే పదే అర్ధించాడు. నేను నా భర్త శవాన్ని

వదిలేసి ఎక్కడికీ వెళ్లిపోనని అతడికి చెప్పాను. తనకి  ... చలిగా ఉందా ....

కప్పుకోవడానికి ఏమన్నా కావాలా అని అడిగాను. అతడికి కప్పుకోవడానికి నా

దుపట్టా ఇవ్వగలిగాను. అతను దాహం వేస్తోందన్నాడు. కానీ అక్కడ ఎక్కడా

మంచినీళ్లు లేవు.

    గంటలు గడిచే కొద్దీ..... పెద్ద గడియారపు స్థంభం నుంచి పెద్దగా లోహపు

గంటల శబ్దం వికృతంగా వినవచ్చేది. రాత్రి రెండు గంటలకి... ఒక గాయపడిన

మనిషి హృదయవిదారకంగా  మూలుగుతూ నన్ను అర్ధించాడు. అతడి కాళ్లు

రెండూ మృతదేహాల గుట్ట కింద చిక్కుకుని ఉన్నాయి. తన కాళ్లని

విడిపించమని అడిగాడు. ఆయన సుల్తాన్‌ గ్రామం నుంచి వచ్చిన ఒక జాట్‌.

నేను లేచి నిలబడి, రక్తసిక్తమైన ఆయన దుస్తుల్ని పట్టుకుని ఆయన కాళ్లని

బయటికి లాగాను. ఆ తర్వాత ... ఉదయం అయిదున్నర వరకూ  అక్కడికి

ఎవరూ రాలేదు. ఉదయం ఆరు గంటలకి, మా వీధి నుంచి లాలా సుందరదాస్‌

ఆయన ఇద్దరు కొడుకులు ఒక మంచాన్ని తీసుకుని వచ్చారు. నేను నా భర్త

శరీరాన్ని బయటకి తీసుకు వచ్చాను. బాగ్‌లో ఇంకా ....తమ స్నేహితుల

గురించి, బంధువుల గురించి ఎదురు చూస్తున్న ఎందరినో... అభాగ్యులని

నేను చూశాను.


    నేను ఆ రాత్రంతా అక్కడ గడిపాను. ఆనాటి నా మానసిక స్థితిని

వర్ణించేందుకు నాకు మాటలు చాలవు. నా చుట్టూ శవాల గుట్టలు ఉన్నాయి

...అందులో అనేక దేహాలు అమాయకులైన పసివాళ్లవి. ఆ కాళరాత్రి ...నాకు

వినిపించినవి ...కుక్కలు మొరిగే శబ్దాలు ...గాడిదల అరుపులు.... ఇంతకు

మించి ఏం చెప్పగలను? ఆ భయానకమైన రాత్రి ఎలా గడిచిందో.... దేవుడికే

తెలియాలి...''

    'జలియన్‌ వాలా బాగ్‌' శీర్షికతో సుప్రసిద్ధ రచయిత భీష్మ సహాని రచించిన

పుస్తకం ఈ నిస్సహాయురాలు, అభాగ్యురాలైన స్త్రీ అనుభవంతో

ప్రారంభమౌతుంది.



    వేల సంవత్సరాల ....సంఘర్షణల, .....విజయాల, ...అణచివేతల,

....పోరాటాల,  ....వెలుగు చీకట్ల ...సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఒక

మహత్తరమైన జాతికి, ....ఆనాడు తగిలిన గాయం ఎంత ....లోతైనదో,  ...ఆ

అనుభవం ఎంత ...భయానకమైనదో, ....ఆ అవమానం ఎంత

...దుస్సహమైనదో .... వర్ణించడానికి ..... మాటలు ఎలా సరిపోతాయి....?


    యావత్‌ జాతికీ స్వాతంత్య్రోద్యమపు బాప్తిస్మాన్ని ప్రసాదించిన నెత్తుటి నది

- జలియన్‌ వాలా బాగ్‌.

    శతాబ్దాల బ్రిటిష్‌ బానిసత్వానికి భారతదేశం పొందిన జీతం....

    అరె.... చేతులు ముంచి చూడు... అది మన తండ్రుల తాతల రక్తం....

                   ~ ~ ~ ~ ~

   
    ఏప్రిల్‌ 6 నుంచి ఏప్రిల్‌ 13 వరకూ ...

    ఆ వారం రోజుల్ని మనదేశంలో 'జాతీయ వారం'గా పరిగణిస్తారు.  
 

              భారతదేశం ఒక దేశంగా ఉన్నంత వరకూ, భారత జాతి ఉన్నంత

వరకూ, ఈ భూమి మీద మనం మనంగా మిగిలి ఉన్నంత వరకూ గుర్తు

చేసుకోవలసిన రోజులవి.


    1919 సంవత్సరం ఏప్రిల్‌ 6నుంచి, ఏప్రిల్‌ 13 వరకూ జరిగిన సంఘటనలు

మన దేశ చరిత్రలో ఎన్నటికీ మరువలేనివి, మరపు రానివీ...


    శవాల గుట్టల మధ్య ... నెత్తురు మధ్య .... ఆ రాత్రి అసహాయ... క్షతగాత్ర

భారతీయులు మోసిన వేదన.... బరువు ...మన బానిసత్వానిది. అప్పటికే 3

శతాబ్దాల వయసు ఉంది మన జాతి బానిసత్వానికి.


    శతాబ్దాల బానిసత్వపు అంధకారపు మత్తునుంచి మన జాతి కళ్లు

విప్పుతున్న కాలం అది. గాంధీజీ చిత్రం మన దేశ యవనిక పైన

ఆవిష్కరించబడుతున్నది అప్పుడే.    


    కేవలం గుప్పెడు మంది ఉన్నత వర్గ భారతీయులకి పరిమితమై, బ్రిటిష్‌

వారికి సలహాలు చెప్పేందుకు, శుష్కమైన చర్చలకు పరిమితమైన కాంగ్రెస్‌

సంస్థని - రానున్న కాలంలో - అశేష అక్షౌహిణుల ప్రజా సైన్యం నిర్వహించే

మహోజ్వల పోరాటాలకి వాహికగా - మలిచేందుకు గాంధీజీ సంకల్పించిన

కాలం అది.


    భారత స్వాతంత్య్ర పోరాటపు ప్రభాతంలో గాంధీజీ ఆగమన ఘట్టాన్ని

నెహ్రూ తన సుప్రసిద్ధ 'డిస్కవరీ ఆఫ్‌ ఇండియా' గ్రంథంలో ఇలా వర్ణించారు:


    ''...గాంధీజీ అప్పుడు ప్రవేశించారు.


    వీచిన తాజా గాలి పరిమళపు బలమైన వెల్లువ వలె ఉన్నది - ఆయన

ఆగమనం, ఆ పరిమళం మేమంతా ఒకసారి ఒళ్లు విరుచుకుని, ఊపిరితిత్తుల

నిండుగా దీర్ఘమైన ఉఛ్వాస తీసుకునేలా చేసింది.

    చీకట్లని చీల్చే కాంతి కిరణం వలె ఉన్నది ఆయన ఆగమనం, ఆ కాంతి మా

కళ్లకి ఉన్న పొరల్ని కరిగించింది.


    సమస్త వస్తురాశినీ విసిరేసిన సుడిగాలి వలె ఉన్నది ఆయన ఆగమనం, ఆ

సుడిగాలి ఎందరి మస్తిష్కాలనో ఊపివేసింది.


    ఆయన దివినుంచి దిగి వచ్చిన మనిషి మాదిరిగా అగుపించలేదు,

మిలియన్ల మంది సాధారణ భారతీయులనుంచే ఆయన ఉద్భవించినట్టుగా

తోచింది. ఆయన వారి భాషే మాట్లాడాడు. విసుగూ విరామం లేకుండా,

వారివైపు, వారి చితికిన బతుకులవైపు అందరి దృష్టిని మరలిస్తూనే ఉన్నాడు.

ఈ రైతుల, శ్రామికుల వీపులమీద సాగిస్తున్న స్వారీని కట్టిపెట్టి ...దిగండి,

మీరు బతికేది వారిని దోచుకోవడం ద్వారానే, ఈ దారిద్య్రానికీ, దౌర్భాగ్యానికీ

కారణ భూతమైన వ్యవస్థని నిర్మూలించండి, అని ఆయన మాకు చెప్పాడు...''


    మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు ఇచ్చిన సహకారానికి ప్రతిగా,

వారికి రౌలట్‌ కమిటీ సిఫార్సు చేసిన నల్లచట్టాల్ని బహుమానంగా

ఇచ్చేందుకు సంకల్పించింది బ్రిటిష్‌ ప్రభుత్వం. 



    రౌలట్‌ బిల్లు ఆచరణ రూపం తాల్చితే, ఏ భారతీయుడినైనా కారణం

చూపకుండానే, కోర్టులతో పని లేకుండానే రెండేళ్లు జైల్లో పెట్టవచ్చు,

పత్రికారంగాన్ని పూర్తిగా అదుపు చేయవచ్చు.


    రౌలట్‌ బిల్లుకు వ్యతిరేకంగా సత్యాగ్రహ సమరాన్ని తలపెట్టారు గాంధీజీ.

భారతప్రజలకు అప్పటికి సత్యాగ్రహమంటే ఏమిటో తెలియదు. అది ఒక కొత్త

పదమే.


    అహింసాయుతంగా సాగాల్సిన సత్యాగ్రహ ఉద్యమ విశిష్టతని వివరిస్తూ

గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటన ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం

దావానలంలా వ్యాపించింది. పంజాబ్‌లో ఈ ఉద్యమానికి విద్యాధికులైన డా||

సైఫుద్దీన్‌ కిచ్లూ, డా|| సత్యపాల్‌ నాయకులు.



    ప్రజా ఉద్యమంతో పట్టింపు లేకుండా ప్రభుత్వం రౌలట్‌ బిల్లును చట్టం

చేసింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా గాంధీజీ మొదట 1919 మార్చి30న దేశ

వ్యాప్త సమ్మె జరపాలని పిలుపు ఇచ్చారు. ఆ తర్వాత సమయం సరిపోదని

భావించడం వల్ల ఆ సమ్మెను ఏప్రిల్‌ 6కి మార్చారు.

డా|| సైఫుద్దీన్‌ కిచ్లూ


డా|| సత్యపాల్‌
    సమ్మె తేదీని

మార్చారనే సమాచారం

తెలియకపోవడం వలన,

మార్చి 30వ తేదీ నాటి

సమ్మెకి ప్రజలను సన్నద్ధం చేసే ఉద్దేశంతో, ఆ ముందురోజే (29 తేదీనే),

అమృతసర్‌ జలియన్‌ వాలా బాగ్‌లో వేలాదిమందితో సభ జరిగింది. సమ్మె

బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమైనది కాదని, కేవలం ప్రభుత్వ అణచివేత

విధానాలకు మాత్రమే వ్యతిరేకమైనదని, గాంధీజీ పిలుపు ఇచ్చిన మేరకు

సమ్మెను పూర్తిగా అహింసాత్మకమైన పద్ధతుల్లోనే సాగించాలని, - ఆనాటి

సభలో ప్రసంగించిన, డా||కిచ్లూ, డా||సత్యపాల్‌ తదితర నాయకులు

ఉద్బోధించారు.



    జలియన్‌ వాలా బాగ్‌ అనేది అమృతసర్‌ పట్టణంలోని ప్రదేశం. బాగ్‌ అంటే

తోట అని అర్ధం. ఆ స్థలం ఒకప్పుడు పండిట్‌ జల్లా అనే వ్యక్తికి చెందిన తోట

అని చెపుతారు. నిజానికి అక్కడ తోట వంటిదేమీ లేదు. ఆ ఖాళీ స్థలం చుట్టూ

అప్పటికే ఇళ్లు వచ్చేశాయి. ఆ ఇళ్ల వెనుకభాగం జలియన్‌వాలా బాగ్‌ వైపు

ఉండేది. ఎటు చూసినా ఇళ్ళ గోడలు చుట్టుముట్టినట్టున్న జలియన్‌ వాలా

బాగ్‌లోకి ప్రవేశించేందుకు కేవలం 4, 5 ఇరుకు సందులు మాత్రం ఉండేవి.



    సభ జరిగిన మర్నాడు (మార్చి30న) సమ్మె బ్రహ్మాండంగా జయప్రదమైంది.

ఆ సాయంత్రం జలియన్‌ వాలాబాగ్‌ పార్కులో మరో పెద్ద సభ జరిగింది.

40,000మందికి పైగా ప్రజలు హాజరయ్యారు.


    మరోపక్క ఢిల్లీలో సైతం అదే రోజు సమ్మె జరిగింది. అయితే సమ్మెను

అణచేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 8మంది మరణించారు, అంతకు

రెట్టింపు మంది గాయపడ్డారు. ఆ సాయంత్రం జరిగిన సభని, ప్రదర్శనని సైతం

పోలీసులు ఆటంక పరిచేందుకు ప్రయత్నించినపుడు స్వామి శ్రద్ధానంద

పోలీసులకి తన ఛాతీని చూపి కాల్చమని సవాల్‌ చేశారు. ఆ మర్నాడు 31న

మృతవీరుల అంతిమయాత్ర జరిగింది.


    సత్యాగ్రహ ఉద్యమంలో పంజాబ్‌ ప్రజలు చురుకుగా పాల్గొన్న సంగతి,

ఆరాష్ట్ర గవర్నర్‌ మైకేల్‌ ఓ. డయ్యర్‌ని తీవ్రంగా కలవరపరిచింది.   



    ఏప్రిల్‌ 6నుంచి, ఏప్రిల్‌ 13 వరకూ జరిగిన ఘటనా క్రమం ఇదీ:           


    ఏప్రిల్‌6 : ఆరోజు అమృతసర్‌లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. ఆ

సాయంత్రం 50,000మందితో సభ సైతం జరిగింది. తీర్మానాలు, ఉపన్యాసాలు,

కథలు, కవితలు ... గాంధీజీ బోధనలననుసరించి ఉద్యమం సాగాలని...

వక్కాణింపులు..



    ఏప్రిల్‌ 7  : గాంధీజీ 'సత్యాగ్రహి' అనే శీర్షికతో ఒక పత్రాన్ని రూపొందించారు.

ప్రభుత్వ అనుమతి లేకుండానే.... దాన్ని ప్రచురించారాయన.



    ఏప్రిల్‌ 8  : అమృతసర్‌ డిప్యూటీ కమిషనర్‌ లాహోర్‌లోని కమిషనర్‌కి

వివరంగా లేఖ రాశారు. అమృతసర్‌కు అదనంగా బలగాలను పంపాలని ఆ

లేఖలో విఙ్ఞప్తి చేశారు.

రౌలత్ ఉద్యమం పైన పోలీసుల దమనకాండ
    ఏప్రిల్‌ 9 : ఆరోజు శ్రీరామనవమి. ఆ ఉత్సవాన్ని 'జాతీయ సంఘీభావ దినం'గా జరపాలని అమృతసర్‌ ప్రజలు నిర్ణయించుకున్నారు. శాంతియుతంగా సాగిన ఉత్సవంలో హిందూ, ముస్లిం ప్రజల మధ్య సమైక్యత అపూర్వమైన రీతిలో వెల్లివిరిసింది. ముస్లింలు సైతం రామనవమిలో పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు ఒకే పాత్ర నుంచి నీళ్లు తాగారు. 'హిందూ ముసల్మాన్‌కీ జై', 'మహాత్మాగాంధీకీ జై' నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. (దీనికి కొద్దిరోజుల ముందే... ఏప్రిల్‌ 4న హిందూ ముస్లిం సమైక్యతలో ఒక అపూర్వమైన ఘట్టం ఢిల్లీ నగరంలో ఆవిష్కృతమైంది. పోలీసు కాల్పుల్లో మరణించిన మృతవీరుల కోసం ప్రార్థనలు చేసేందుకు, ఢిల్లీ నగరంలోని వేలాది మంది హిందువులు నగరం నడిబొడ్డులో ఉన్న జుమ్మా మసీదుకు వెళ్లారు. ముస్లిములు వారికి సాదరంగా స్వాగతం పలికారు. ఏప్రిల్‌ 6న ఆర్యసమాజ్‌ నాయకుడు స్వామి శ్రద్ధానంద జుమ్మా మసీదులో జరిగిన భారీ సభలో ప్రసంగించి చరిత్ర సృష్టించారు.)
    పంజాబ్‌ ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రభుత్వం, ఉద్యమ నేతలు డా|| కిచ్లూ, డా|| సత్యపాల్‌లను అరెస్టు చేసింది.
    ఏప్రిల్‌ 10  : గాంధీజీ ఢిల్లీ, అమృతసర్‌ పట్టణాల్లో ప్రవేశించ రాదని, మైకేల్‌ ఓ. డయ్యర్‌ నిషేధపు ఉత్తరువులు జారీ చేశాడు. అసలు గాంధీజీ ముంబాయి వదిలి పోరాదని, ప్రభుత్వం మరో ఉత్తరువు ఇచ్చింది.
    నిషేధపు ఆఙ్ఞల్ని ధిక్కరించి గాంధీజీ పంజాబ్‌కు పయనమయ్యారు. పల్వల్‌ వద్ద గాంధీజీని అడ్డుకుని పోలీసులు రైలునుంచి దింపి వేశారు. ఉద్రిక్తతలకు లోను కావద్దని గాంధీజీ ప్రజలకు ప్రత్యేకంగా విఙ్ఞప్తి చేశారు.
    డా|| కిచ్లూ, డా|| సత్యపాల్‌ అరెస్టులకు వ్యతిరేకంగా అమృత సర్‌ ప్రజలు సమ్మె చేశారు. సమ్మెకారులపైన పోలీసు కాల్పులు జరిపిన రెండు సంఘటనల్లో అనేకులు మృతి చెందారు (రెండవసంఘటనలో మృతులు 20మంది).
    బ్రిటిష్‌ పోలీసుల విచక్షణా రహిత హింసాకాండ పరిస్థితిని అతలాకుతలం చేసింది, ప్రజల్ని ఆగ్రహోదగ్రుల్ని చేసింది. అనంతరం జరిగిన ఘర్షణల్లో కొందరు ఆంగ్లేయులు ప్రాణాలు కోల్పోయారు. ఆనాటి ఘర్షణల్లో 'షెర్‌ ఉడ్‌' అనే ఇంగ్లీషు వనిత పైన కొందరు భారతీయులు దాడి చేశారు. అయితే, ఆరోజు ఆమెని రక్షించింది కూడా భారతీయులే.
    ఏప్రిల్‌ 11 : అమృతసర్‌లో సైనిక పాలన విధించారు. శవయాత్రల్లో సైతం నలుగురు మించి పాల్గొనరాదని ఆంక్షలు విధించారు. బ్రిగేడియర్‌ జనరల్‌ ఆర్‌. ఇ. హెచ్‌. డయ్యర్‌ను రప్పించి ఆయనకి అమృతసర్‌ బాధ్యతల్ని అప్పగించారు.
    ఏప్రిల్‌ 12  : జనరల్‌ డయ్యర్‌ వందల మంది సైనికులతో పట్టణమంతా తిరిగాడు. ఉద్యమకారులు ఆ మరునాడు జలియన్‌వాలా బాగ్‌లో పెద్ద సభ జరపాలని, ప్రజల్ని మరిన్ని త్యాగాలకు సిద్ధం కావలసిందిగా కోరాలని నిర్ణయించారు. ఆనాటి సభలో జైలు నుంచి డా||కిచ్లూ, డా||సత్యపాల్‌ రాసిన ఉత్తరాల్ని చదివి వినిపించాలని నిర్ణయించారు. ఆ నేతలిద్దరినీ విడిపించుకునేందుకు సమ్మెకు సన్నాహాలు చేయాలని నిర్ణయించారు.
    ఏప్రిల్‌ 13 : జలియన్‌వాలా బాగ్‌లో డయ్యర్‌ అమానుషమైన ఊచకోత జరిపించాడు.
    ఫైర్‌.......   
    ఆరోజు సిక్కులకి ఎంతో పవిత్రమైన వైశాఖీ పర్వదినం.
    కరడు కట్టిన కౄరుడు డయ్యర్‌ మనసులో ఆనాటి ఉదయం నుంచే పైశాచికమైన ఆలోచనలు సాగుతున్నాయి.
    అమృతసర్‌ బాధ్యతలు స్వీకరించే క్షణంలోనే భారతీయుల రక్తం కళ్ల చూడాలనే కాంక్ష డయ్యర్‌ తలలో నాట్యం చేస్తూండవచ్చు.
    ఏప్రిల్‌ 13న జలియన్‌ వాలా బాగ్‌లో సభ జరుగుతుందనే విషయం తెలిసినప్పటినుంచీ డయ్యర్‌కి అసహనంగానే ఉంది. ఉదయం నుంచి దెయ్యం పట్టినట్టుగా పట్టణమంతా తిరిగాడు డయ్యర్‌. అతడి వెంట వందల మంది సాయుధ బలగం ఉన్నారు.
    నలుగురి కంటే ఎక్కువమంది వ్యక్తులు గుమికూడటం నిషిద్ధమని, 8గం.తర్వాత బయట కనిపిస్తే కాల్చివేస్తారని, - పట్టణంలో కొన్ని ప్రదేశాల్లో పెద్ద డ్రమ్‌, ఉపయోగించి - చాటింపు వేయించాడు డయ్యర్‌.
    పట్టణంలో కొందరు యువకులు డ్రమ్ములకు బదులు చిన్న, చిన్న రేకుడబ్బాలు వాయిస్తూ, ఆ సాయంత్రం 4గం. 30ని.కి జలియన్‌ వాలాబాగ్‌లో సభ ఉన్నదని, డయ్యర్‌ చాటింపు వేసిన ప్రాంతాల్లో - తిరిగి, తిరిగి ...అరిచి చెప్పారు.
    సభాస్థలికి 2గం. నుంచే జనం రావడం ప్రారంభించారు. సభ ప్రారంభమయ్యే సమయానికి 20,000మందికి మించి జలియన్‌వాలా బాగ్‌లో సమీకృతమయ్యారు.
    డయ్యర్‌  సభని నిషేధించిన విషయం కూడా అరకొరగానే ప్రచారమైంది.
    తాను సభ జరగకుండా ఆపలేకపోతున్నాననే అక్కసు డయ్యర్‌కి పెరిగిపోయింది. తన ఆఙ్ఞని ధిక్కరించి, ఉద్యమకారులు సభ జరుపుకోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అది తన అధికారానికే సవాల్‌ అని ఆయనకి తోచింది. వారికి బుద్ధి చెప్పాలని ఆయన దృఢ నిశ్చయానికి వచ్చాడు.
    పోలీసు బలగాల్ని వెంటబెట్టుకుని తిన్నగా జలియన్‌వాలా బాగ్‌కు దారితీశాడు. సభాస్థలికి తన సాయుధ శకటాలను, బలగాలను నడిపించాడు.
    జలియన్‌వాలా బాగ్‌కు దారి అయిన ఇరుకు సందులో డయ్యర్‌ మిలటరీ శకటం ప్రవేశించలేకపోయింది.
    డయ్యర్‌ వెంట సభలో ప్రవేశించిన వారిలో తుపాకులు చేతబూనిన 50మంది సైనికులు, కుక్రీ(వంపు తిరిగిన కత్తి)లు ధరించిన 40మంది గూర్ఖాలు ఉన్నారు.    
    బాగ్‌లోకి ప్రవేశించిన డయ్యర్‌కి, కుడిపక్కన 25మంది సైనికులు, ఎడమ పక్కన 25మంది సైనికులు పొజిషన్‌ తీసుకుని నిలబడ్డారు.
    వేలమంది ప్రజలతో సభ ప్రశాంతంగా సాగిపోతోంది. వేదికల మీద వక్తల ప్రసంగాలని ....జనం శ్రద్ధగా ఆలకిస్తున్నారు. అక్కడక్కడ ఆమోద సూచకంగా తల ఊపుతున్నారు. ఎక్కడా .... విద్వేషపు ఛాయలు లేవు.
    జనరల్‌ డయ్యర్‌ కొన్ని క్షణాలు ఆవరణ అంతా చూపులతోనే పరీక్షించాడు. పరిస్థితి అంచనా వేసుకున్నాడు. సభా స్థలి నలువైపులా గోడలతో, ఇళ్ల నిర్మాణాలతో ప్రజలు తప్పించుకునే అవకాశం లేకుండానే ఉంది.
    పోలీసుల రాకని గమనించిన సభికుల్లో కొద్దిగా కలకలం రేగింది. డయ్యర్‌ మెదడులో ఆ క్షణాల్లో ఊపిరి పోసుకుంటున్న పైశాచిక యోచనలను ఊహించడం ఎవరికైనా దుస్సాధ్యమే. కేవలం ప్రజల్ని బెదిరించేందుకే, పోలీసులు అక్కడికి వచ్చిఉంటారని చాలా మంది ప్రజలకి ధైర్యం ఉన్నా.... ఇంకా ....ఏమూలో... అవ్యక్తమైన కలవరం.....
    కేవలం మూడు రోజుల క్రితమే బ్రిటిష్‌ తుపాకులు నిష్కారణంగా ఎందరో  అమాయకుల ప్రాణాలు తీసిన సంగతి తెలియని వారెవరూ అక్కడ లేరు. ఏదో ముప్పు ముంచుకు వచ్చిందేమోనని కొందరు లేచి నిలబడ్డారు.
    పొజిషన్‌ తీసుకుని కూర్చున్న సైనికులు ఒక వైపు, .... వేలాది మంది ప్రజలు మరొక వైపు.....
    డయ్యర్‌ భృకుటి ముడి పడింది.
జనరల్ డయ్యర్
    అతడి చూపు మారింది... కోడిపిల్లల్ని కబళించేందుకు విషపు కోరలు తెరిచిన కోడెతాచు చూపు అది.... 
    ఇదంతా అతడు బాగ్‌ లోపలికి వచ్చి నిలబడిన కొన్ని సెకన్లలోనే.....
    ''...ఫైర్‌....'' వికృతంగా అరిచాడతను.
    50 తుపాకులు ఒక్కసారిగా గర్జించాయి....
    భయంతో, .....షాక్‌తో .......పరుగులు తీస్తున్న జనం.... ముందు నిలబడిన వారు కూలిపోయారు..... నేలంతా నెత్తుటి కళ్లాపి..........
    నేను వాళ్లని శిక్షించాలనుకున్నాను
    @ నువ్వు బాగ్‌లోకి వచ్చాక, ఏం చేశావు?
    - కాల్పులు ప్రారంభించాను.
    @ ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించావా?
    - తక్షణమే. నేను ఆ విషయం గురించి ఆలోచించాను. నా మనసును సిద్ధం చేసుకోవడానికి, నా కర్తవ్యమేమిటో ఆలోచించుకోవడానికి నాకు 30సెకండ్లకి మించి సమయం పట్టిందనుకోను.
    జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ జరిగిన 6 నెలల తరవాత, కంటి తుడుపుగా బ్రిటిష్‌ ప్రభుత్వం నియమించిన హంటర్‌ కమిషన్‌ ప్రశ్నలకి కౄరుడు డయ్యర్‌ చెప్పిన సమాధానాలు ఇవి.
    డయ్యర్‌  ఇచ్చిన సమాధానాలు ఇంకా ఇలా ఉన్నాయి...
    @  మీరు కాల్చిన వెంటనే... గుంపు చెదిరిపోవడం మొదలైందా?
    - తక్షణమే.
    @  మీరు కాల్పులు కొనసాగించారా?
    - అవును.
    @ జనం బాగ్‌ అటు చివర్న ఉన్న మరో దారి గుండా తప్పించుకోవాలని ప్రయత్నించారు కదా?
    - అవును.
   @  ఆ దారి దగ్గరే జనం ఎక్కువగా కూడారని అనుకోవచ్చా?
    - నిజమే.
  @  మీరు ఎప్పటి కప్పుడు కాల్చే దిశను మార్చి, గుంపు ఎక్కడ దట్టంగా ఉన్నారో ... అటు వైపు కాల్పులు జరిపారు కదా?
    - అవును, అలాగే జరిగింది.
   అలాగే జరిగిందా?
    - నిజమే.
    మీరు మాకు వివరించిన కారణాలను బట్టి, ప్రజలపైన కాల్పులు జరపాలని ముందే మీరు నిశ్చయించుకున్నారు.
    - పూర్తిగా నిజం.
    @  ప్రతిపాదిత సభ గురించి 12గం. 40ని.లకి విన్నపుడే, ...ఒకవేళ సభ అంటూ జరిగితే.. వెళ్లి కాల్పులు జరపాల్సిందేనని, మీరు మనసులో స్థిర నిశ్చయానికి వచ్చారు?
    - ... వెళ్లి తక్షణమే కాల్పులు జరపాలని, నేను మనసులో మొదటే స్థిర నిశ్చయానికి వచ్చాను. కాల్పులు మిలటరీ స్థితిని కాపాడేందుకోసం. ఇక మనం ఏమాత్రం వేచి ఉండలేని తరుణం వచ్చేసింది. ఒక వేళ ఏ కొంచెమైనా ఆలస్యం చేస్తే, నేను కోర్టుమార్షల్‌కి అర్హుడినయ్యేవాడిని.
    @  ఒకవేళ ఆ సందులో సాయుధ శకటాలని లోపలికి తీసుకువెళ్లేందుకు సరిపడినంత వెడల్పుగా ఉండి ఉంటే, మీరు మెషీన్‌ గన్లతో కాల్పులు జరిపి ఉండేవారా?         - బహుశా అది నిజమేననుకుంటాను.
    @  అలా జరిగి నప్పుడు మృతుల సంఖ్య చాలా ...చాలా ఎక్కువ ఉండేది కదా?
    - అవును.
    @  అంటే మీరు మెషీన్‌ గన్లతో కాల్చలేకపోయింది ...కేవలం అక్కడ సాయుధ శకటాలు లోపలికి వెళ్లే దారి లేకపోవడంవల్లేనా?
    - నేను మీ ప్రశ్నకి జవాబిచ్చాను. అవి లోపలికి వచ్చి ఉంటే, మేం బహుశా వాటినే ఉపయోగించి కాల్పులు జరిపి ఉండేవాళ్లమని చెప్పాను.
    @   మెషీన్‌ గన్స్‌తో సూటిగా కాల్పులు జరిపేవారా?
    - మెషీన్‌ గన్స్‌తో సూటిగా కాల్పులు జరిపేవారం.
    ఆ చర్య చేపట్టడంలో (కాల్పులు జరపడంలో) మీ ఉద్దేశం, భయోత్పాతం కలిగించడమేనని అనుకుంటున్నాను.
    - మీకు నచ్చినట్టు అనుకొండి, నేను వాళ్లని శిక్షించాలనుకున్నాను. మిలటరీ దృక్పధం నుంచి నా ఆలోచన ఏమిటంటే, ...పెద్ద ఎత్తున ప్రభావం వేయాలని.
   @  అమృతసర్‌లో మాత్రమే కాదు, పంజాబ్‌ అంతటా భయోత్పాతాన్ని కలిగించాలనేనా?
    - అవును, పంజాబ్‌ అంతటా. నేను వాళ్ల నైతిక దీక్షని దెబ్బతీయలానుకున్నాను... తిరుగుబాటు దార్ల నైతిక దీక్షని.
            (చూడండి: 'భీష్మ సహాని' రచన, 'జలియన్‌ వాలా బాగ్‌')
    జనరల్‌ డయ్యర్‌ ఎంత కరడు కట్టిన రక్త పిశాచో ...పై సమాధానాలు స్పష్టం చేస్తాయి. నిజానికి ఇది డయ్యర్‌ ఒక్కడి ఆలోచన కాదు, ఆనాటి బ్రిటిష్‌ సైనికాధికారుల మనస్థత్వానికి ప్రతీక.
'గాందీ' చలన చిత్రంలో జలియన్ వాలాబాగ్ మారణకాండ దృశ్యం
    ఈ మనస్థత్వాన్ని గురించే చాలా కాలం తర్వాత జవహర్‌లాల్‌ నెహ్రూ తన 'గ్లింప్సెస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ హిస్టరీ' (పే. 714, 715)లో ఇలా రాశారు :
    ''...అమృతసర్‌ జలియన్‌ వాలా బాగ్‌లో ఏప్రిల్‌13న జరిగిన ఊచకోత గురించి ప్రపంచమంతటికీ తెలుసు. తప్పించుకోవడానికి దారిలేని ఆ మృత్యుబోనులో వేలమంది మరణించారు, మరెందరో గాయపడ్డారు. 'అమృతసర్‌' అనేమాటే, ఊచకోతకి సమానార్ధకంగా మారిపోయింది. ఇంతకంటే ఘోరమేమిటంటే... పంజాబ్‌ అంతటా మరెన్నో లజ్జాకరమైన ఘటనలు జరిగాయి.
    ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ ఆటవికతని, భయోత్పాతాన్ని  క్షమించడం చాలా కష్టం. అంతేకాదు, దాన్ని అర్ధం చేసుకోవడమూ కష్టమే. భారతదేశంలోని బ్రిటిష్‌ వారు బహుశా వారి అధిపత్య స్వభావరీత్యానే, తాము నిరంతరం ఒక అగ్ని పర్వతం మీద కూర్చుని ఉన్నామని భావిస్తూ ఉంటారు. వారు చాలా అరుదుగా మాత్రమే భారతదేశపు మనసుని లేదా హృదయాన్ని అర్ధం చేసుకున్నారు, లేదా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించారు. వాళ్లు ఇక్కడ వేరేగా జీవించేందుకు ప్రయత్నించారు. వాళ్ల విస్తారమైన, సంక్లిష్టమైన వ్యవస్థ మీదా, బలగాల మీద మాత్రమే ఆధారపడేందుకు ఇష్టపడ్డారు. వాళ్ల బింకం వెనకాల, అవ్యక్తమైన దేనిపట్లో భయం ఉండేది. ఒకటిన్నర శతాబ్దపు పాలన అనంతరం కూడా .... భారత దేశం వారికి అర్ధంకాని నేలగానే ఉండిపోయింది....''
    భయం కారణంగా, దురంహంకారం కారణంగా.... శాంతియుతంగా సాగే సత్యాగ్రహ ఉద్యమాల పట్ల కూడా బ్రిటిష్‌ వారు పట్టలేని అసహనం, కౄరత్వం ప్రదర్శించేవారు. సిమ్లాలో జన్మించి, భారతదేశం గాలి పీల్చి, భారతదేశం స్తన్యాన్ని గ్రోలిన డయ్యర్‌ తన బ్రిటిష్‌  మనస్తత్వాన్ని వదులుకోలేకపోయాడు. ఏ భారతదేశం తిండి తాము తింటున్నాడో..., ఏ భారతదేశం సంపద తాము అనుభవిస్తున్నాడో... ఆ భారతదేశం పట్ల అలవిమాలిన అమానుషత్వాన్ని ప్రదర్శించడం, భారతీయుల రక్తాన్ని కళ్లచూడటం - అవధిలేని కృతఘ్నతకి, వికృత మనస్థత్వానికి నిదర్శనం. 
    జలియన్‌వాలా బాగ్‌ మారణకాండ వివరాలను నెలలతరబడి బ్రిటిష్‌ ప్రభుత్వానికి తెలియకుండా తొక్కి పట్టింది.
    కేవలం 379మంది మరణించారని, 1137మంది గాయపడ్డారని .....బ్రిటిష్‌ ప్రభుత్వం పేర్కొంది. అయితే గాంధీజీ నేతృత్వంలో కాంగ్రెస్‌ బృందం సాగించిన విచారణలో 1200మంది మరణించారని, 3600మంది గాయపడ్డారని స్పష్టమైంది.            ..రాబందులు ఆ శవములను పీకి, పీకి తినినవి..
    డయ్యర్‌ ''ఫైర్‌...'' అని ఆదేశించిన క్షణమే... సిపాయిల తుపాకులు నిప్పులు కక్కాయి.
    అటువంటి రాక్షసాన్ని చరిత్ర ఎన్నడూ చూడలేదు. నిరాయుధులైన ప్రజలపై, అహింసాయుత ఆదర్శాలతో సభ జరుపుకుంటున్న ప్రజలపై, ఎటువంటి కవ్వింపు లేని పరిస్థితిలో... ఎటువంటి హెచ్చరిక లేని స్థితిలో..... సూటిగా ప్రజలపై ...గురిపెట్టి కాల్చిన దారుణం ..... ప్రపంచ చరిత్రలోనే అరుదు.
    దిగ్భ్రాంతిలో.... భయంతో... చెల్లా చెదరై... పరుగులు తీస్తున్న ప్రజలని డయ్యర్‌ వేటాడించిన తీరు.... అతి హేయం....
    చివరికి, నిరాయుధ ప్రజానీకంపై సూటిగా గురిచూసి పేల్చడానికి చేతులు రాని.... పోలీసులు కొందరు ప్రారంభంలో గాలిలోకి కాల్పులు జరుపుతుంటే కూడా.... డయ్యర్‌ సహించలేకపోయాడు. ప్రజల రక్తం కళ్ల చూడనిదే ఆ  పాపాత్ముడి పైశాచిక దాహం చల్లారలేదు.     ''...పైకి కాదు, గురి చూసి... కిందకి కాల్చండిరా.... మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిందెందుకు?'' అని సైనికులమీద ఉగ్రంగా రంకెలు వేశాడు.
    మారణకాండని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ..., ప్రజల్ని గురిపెట్టి .... కాల్పించిన ....      జనరల్‌ డయ్యర్‌.... ఆయన సహచరుడు కెప్టెన్‌ బ్రిగ్స్‌ల శాడిజాన్ని వర్ణించడానికి మాటలు చాలవు...
    దూసుకువస్తున్న బుల్లెట్ల వర్షానికి కుప్పకూలిన ప్రజలు..... చెల్లా చెదురుగా పరుగులు తీసిన ప్రజలు.... గాయపడి నేలకొరిగిన వారిని... జీవ సమాధి చేస్తూ.... నెత్తురోడుతూ.... కూలినవెన్నో ...దేహాలు....
    అల్లకల్లోలంగా పరుగులు తీయడం మాని, ....నేలమీద పడుకుంటే.... చాలా మంది ప్రాణాలు నిలిచేవి.... కానీ .... జలియన్‌ వాలా బాగ్‌ పైన మృత్యుమేఘ ఛాయ దట్టంగా పరుచుకున్న ఆ సాయంత్రం ...వినేవారెవరు? ....చెప్పేవారెవరు?
    ప్రజలు తప్పించుకుందామని .....పరుగులు తీసేదిశవైపు ...పగబట్టి ...గురిపెట్టి తూటాలు కురిపించాడు ....డయ్యర్‌.... ఎత్తైన గోడని ఎక్కి తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రజలని ....తూటాలకి ఎరచేశాడు...
    తూటాలకి కూలినవారు కొందరైతే... తొక్కిసలాటలో చనిపోయిన వారు మరెందరో.... కొందరు అభాగ్యులు గోడమీదకి ఎక్కి అవతలి పక్కకి దిగేలోపు నేలకూలారు.... కొందరు భుజాలమీద ఎగబాకుతూ, పట్టుకోసం ప్రయత్నిస్తూ ఒరిగారు...
    నేల తడిసింది.... నెత్తుటితో.... గాలి నిండిపోయింది... కలిసే ప్రాణాలతో... ఎగిసే ఆర్తరావాలతో...
    జలియన్‌ వాలా బాగ్‌కు దారితీసే ఇరుకు వీధులన్నింటా... వేలాదిగా ...తొక్కిడిగా... ప్రజలు పరుగులు తీశారు... డయ్యర్‌ ఆ వీధులవైపు తన తుపాకుల్ని గురి పెట్టించాడు... కొందరు తూటాలకు నేలకూలారు.... కొందరు కాళ్లకింద నలిగిపోయారు... స్త్రీల పరిస్థితి, పసివాళ్ల పరిస్థితి మరీ అధ్వాన్నం...
    బుల్లెట్లు సృష్టించిన విలయానికి ... విహ్వలులై పరుగులు తీసే జన సమూహపు తొక్కిడికి భయపడి ...తప్పించుకునే దారిలేక... ఎందరో.... బాగ్‌ మధ్యలో ఉన్న బావిలోకి దూకారు....
    మనిషికి ఎటువంటి చావు కావాలి.... శరీరాన్ని ఛిద్రం చేసే బులెట్ల చావా... నెత్తురు చిమ్ముతూ కూలిపోతున్న దేహాల మధ్య నలిగి... ఊపిరాడని చావా... భయోన్మాదంలో పరుగులు తీసే జనవాహిని పదఘట్టనలకింద నలిగిపోయే చావా.... బావిలో చావా...
    జలియన్‌ వాలాబాగ్‌లో ఆ సమయంలో మృత్యుదేవత వేయి పాదాలతో నర్తించింది....
    చావు తప్పదని తెలిసీ... పగలే కళ్లముందు చీకట్లు కనిపించి, ....బావిలో దూకిన నైరాశ్యం.... ఎంతటి మృత్యుశీతలమో....
    మైదానంలో తూటాలకు మాంస ఖండాలు ఊడిన.. మనుషులు బతుకుదామని గుక్కెడు నీళ్లకోసం అలమటించారు... అక్కడే... ఆ సాయంత్రం.. బాగ్‌లో పాడు బడిన బావిలో రక్తం ఊరింది....
    నెత్తురు తాగలేక జలియన్‌వాలాబాగ్‌ నేల గొంతెత్తి విలపించింది....
    విరిగిన అవయవాల మధ్య... గాయాల మధ్య... తొక్కుకుంటూ నడిచే.... గుంపులమధ్య.... రోదనలు.... ఆర్తనాదాలూ.... దుమ్మూ.... కలగలిశాయి...
    ఈ మానవహోమం 15నిముషాలు నిరాటంకంగా సాగింది. మొత్తం చివరి బుల్లెట్‌ ఖర్చయ్యే వరకూ సాగింది... ప్రతీ రైఫిల్‌ నుంచీ ... 33బుల్లెట్ల చొప్పున మొత్తం 1650బుల్లెట్లు ఖర్చు పెట్టామని తర్వాత డయ్యర్‌ లెక్క చెప్పాడు. నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఇంకా ఎక్కువ మందుగుండు, ఇంకా ఎక్కువ బలగాలు బాగ్‌లో అందుబాటులో ఉంటే.... ఇంకా ఎక్కువ సాధించగలిగే వారమని డయ్యర్‌ తరవాత నిర్లజ్జగా చెప్పుకున్నాడు.
    కళ్ల ముందు రక్త నదులు పారినా... మానవ రూప రక్త పిశాచి డయ్యర్‌కి మాత్రం తృప్తి కలగలేదు. అతడి రాక్షసత్వం అక్కడితో ఆగలేదు. సా|| 5గం. 30ని||కి జనరల్‌ డయ్యర్‌ తన మార్బలంతో బాగ్‌నుంచి నిష్క్రమించాడు. వేలాది మృతుల్ని, క్షతగాత్రుల్ని వారి మానానికి వదిలి... నిశ్చింతగా వెళ్లిపోయాడు.
    గుక్కెడు మంచి నీళ్లకోసం..., వైద్య సహాయం కోసం... విలవిలలాడే వేలాది మనుషుల బాధ అతడిని కదిలించలేదు. వైద్యుల మాట దేముడెరుగు, డయ్యర్‌ భయానికి ఒక్క మనిషి కూడా బాగ్‌ వైపు తొంగి చూసే పరిస్థితి లేదు... తమవారు ఏమైనారోనని అల్లల్లాడే మృతుల, క్షతగాత్రుల బంధువులు, రక్త సంబంధీకులు సైతం ఆ వైపు వెళ్లేందుకు భయపడ్డారు...
    క్షత గాత్రులెందరో.... గాయాలతో రక్తమోడుతూ.... దేకుతూనే... ఆ మృత్యు మైదానం నుంచి బయట పడాలనే ఆశతో.... విఫలప్రయత్నం చేసి... వీధుల్లోకి పాకి... ఇక ముందుకు సాగలేక.... రక్తపు మడుగులోనే ....గిజగిజ ....కొట్టుకులాడి ... మరణించిన దృశ్యం.... రాయినైనా కన్నీరు పెట్టిస్తుంది...
    క్షత గాత్రుల బంధువులు కొందరు ధైర్యం చేసి బాగ్‌కి వచ్చి కూడా.... ఆ రాత్రి 8గంటల నుంచి డయ్యర్‌ విధించిన 'కనిపిస్తే కాల్చివేత' ఉత్తరువులు అమలులో ఉండటంతో భయపడి, 8గంటల లోపే క్షతగాత్రులైన తమ తమ బంధువులని తరలించే మార్గంలేక ....నిస్సహాయంగా... ఆరాత్రి ....చలిలో... తమ వారిని ...బాగ్‌లోనే విడిచి... గుడ్లనీరు కుక్కుకుని వెళ్లిపోయిన సంఘటనలు జరిగాయి. కొందరిని మాత్రం వారి సంబంధీకులు తరలించడం సాధ్యమైంది.
    ఆ రాత్రి వేయికి పైగా క్షతగాత్రులు ఎటువంటి సహాయం లభించక, మరణ బాధ అనుభవిస్తూ ...రక్తమోడుతూ.. బాగ్‌లోనే ....పడి ఉన్నారు....
    రక్తం పోయిన కారణంగా... సమయానికి వైద్య సహాయం అందని కారణంగా .... వారిలో ఎందరో ...ఆరాత్రి ...బాగ్‌లో ప్రాణాలు విడిచారు...
    బ్రిటిష్‌ పత్రిక 'డెయిలీ హెరాల్డ్‌' ఈ సంఘటనపై చేసిన వ్యాఖ్యానాన్ని 12.1.1920 నాటి అమృత బజార్‌ పత్రిక ఇలా ఉటంకించింది :
    ''.....దుస్సహమైన మానవ వేదన పట్ల నమ్మ శక్యం కాని సానుభూతి రాహిత్యాన్ని ప్రదర్శిస్తూ బ్రిటిష్‌ అధికారులు గాయాలపాలైన వారికి ఎటువంటి సహాయమూ అందిచకుండా వారిని నడివీధుల్లో వదిలి వెళ్లిపోయారు. మరో భిన్నమైన నాగరికతకి, భిన్నమైన మతానికి, చెందిన అసంఖ్యాక స్త్రీ, పురుషులకి - క్రైస్తవం అనేది ఎంత సౌందర్యవంతమో, ఎంత కరుణామయమో అర్ధమయ్యేలా బోధించేందుకే - వారు (బ్రిటిష్‌ అధికారులు) ఈ పని చేశారని మనం భావించాలి. అంతేకాదు, మనం మన శత్రువును ప్రేమించాలని చెప్పిన అతడి ధర్మాన్ని - మనం, బ్రిటిషర్లం, ఎంత పవిత్రంగా ఆచరిస్తున్నామో - చాటేందుకే  - వారు (బ్రిటిష్‌ అధికారులు) ఈ పని చేశారని మనం భావించాలి....''     (చూడండి: 'భీష్మ సహాని' రచన, 'జలియన్‌ వాలా బాగ్‌')
    బి. ఎన్‌. శాస్త్రి తన 'భారతదేశ చరిత్ర - సంస్కృతి' గ్రంధం 18వ భాగం (పే.208)లో ఇలా రాశారు: ''... ఆనాటి సభలో చనిపోయిన వారిని  చూచుటకు వారి బంధువులు భయపడిరి. వారు మరణించిన వారి శవములనైనను చూచుటకు వెడలలేదు. నక్కలు, రాబందులు, ఆ శవములను పీకి, పీకి తినినవి. ఆ ప్రదేశమంతట దుర్గంధము వ్యాపించినది...''
    వేలాది మంది క్షతగాత్రులకి ఎటువంటి సహాయమూ అందించకపోవడం పట్ల డయ్యర్‌ ఎటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు. 'అది నా బాధ్యత కాదు' (ఇట్‌  ఈజ్‌ నన్‌ ఆఫ్‌ మై బిజినెస్‌) అని వ్యాఖ్యానించాడు (చూడండి: 'గ్లింప్సెస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ హిస్టరీ' పే.715).
    హంటర్‌  కమిషన్‌ ముందు క్షతగాత్రులకి సహాయం గురించి మాట్లాడుతూ డయ్యర్‌ 'వాళ్లు దరఖాస్తు చేసుకుని ఉంటే నేను సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నాను' అని దురహంకార పూరితంగా వ్యాఖ్యానించాడు (చూడండి: లూయీ ఫిషర్‌ రచించిన 'ది లైఫ్‌ ఆఫ్‌ మహాత్మాగాంధీ' హార్పర్‌ కాలిన్స్‌ ప్రచురణ, పే.233).                కధ ఇంకా పూర్తి కాలేదు.... జలియన్‌ వాలా బాగ్‌ దురంతం అనంతరం జనరల్‌  డయ్యర్‌ భయానకమైన అణచివేతతో అమృతసర్‌ ప్రజల్ని నానా బాధలకి గురిచేశాడు.
    ఆ వీధిలో పొట్టమీద దేకుతూ పాకాలి...        పుండుమీద కారం చల్లినట్టు మారణ కాండ జరిగిన మర్నాడు, ఏప్రిల్‌ 14 నుంచి, అమృత సర్‌ ప్రజలమీద సైనిక పాలన అమలు జరిపాడు జనరల్‌ డయ్యర్‌.
    గవర్నర్‌ సర్‌ మైకేల్‌ ఓ. డయ్యర్‌ నాయకత్వంలో పంజాబ్‌లోను, జనరల్‌ డయ్యర్‌ నాయకత్వంలో అమృతసర్‌లోను - ఆ కాలంలో అమలులోకి వచ్చిన దమనకాండ అత్యంత పాశవికమైనది. డయ్యర్‌ ద్వయం తమని తాము ప్రజాకంటకులుగా నిరూపించుకున్నారు. 
    షెర్‌ ఉడ్‌ పైన దాడి జరిగిన వీధిలో, భారతీయులు ఎవరూ నడిచి వెళ్లరాదని డయ్యర్‌ శాసించాడు. ఆ వీధిలో భారతీయులు జంతువుల మాదిరిగా పొట్టమీద దేకుతూ వెళ్లాలని శాసించారు. ఈ శాసనాన్ని ఉల్లంఘించిన వారిని రైఫిల్‌ మడమలతో చితక కొట్టేందుకు ఆ వీధిలో సైనికాధికారులని నియమించారు. ఆ వీధిలో నివాసమున్న వారికి, అక్కడి నుంచి బయటికి వెళ్లేందుకు మరో దారి లేదని తెలిసినా ఈ శిక్షలనుంచి మినహాయింపు ఇవ్వలేదు.
    భారతీయుల ఇళ్లకి కరెంటు, నీటి కనెక్షన్లని తొలగించారు. రైళ్లలో మూడవ తరగతి టిక్కెట్ల అమ్మకాలను నిలిపి వేశారు.
    బ్రిటిష్‌ వారు ఎదురైనపుడు భారతీయులు తప్పని సరిగా చేతులతో నమస్తే, లేదా సలామ్‌ చెయ్యాలని, అలా చేయని భారతీయులని అరెస్టు చేయవచ్చని డయ్యర్‌ హుకుం. బ్రిటిషర్లు ఎదరురైనపుడు భారతీయులు తమ గొడుగులని దింపాల్సి ఉంది.         అరెస్టులు విచ్చలవిడిగా సాగాయి. అరెస్టు అయిన వారికి అపీలు చేసుకునే అధికారం కూడా లేదు.
    ప్రజల్ని కొరడా దెబ్బలతో, పేం బెత్తం దెబ్బలతో శిక్షించేందుకు, కూడళ్లలో ప్రత్యేకం వేదికలు వెలిశాయి.
    పంజాబ్‌ దురంతాలను విచారించేందుకు కాంగ్రెస్‌ నియమించిన సబ్‌ కమిటీలో మదన్‌ మోహన్‌ మాలవ్యా, మోతీలాల్‌ నెహ్రూ, గాంధీజీ, చిత్తరంజన్‌ దాస్‌, అబ్బాస్‌ ఎస్‌. త్యాబ్జీ, ఎం. ఆర్‌. జయకర్‌, కె. సంతానం సభ్యులు.     ఆ కమిటీ రిపోర్టు నుంచి ('భీష్మ సహానీ' తన 'జలియన్‌ వాలా బాగ్‌' పుస్తకంలో ఉటంకించిన) ఈ భాగాలను చూడండి:
    (లాలా మేఘలాల్‌ అనే వ్యక్తి చెప్పిన సంగతులు)
    ''...ఆరోజు నేను రాత్రి 9గం.కి ఇంటికి వచ్చాను. నా భార్య జ్వరంతో మంచాన పడి ఉంది. ఆమెకి ఇచ్చేందుకు ఇంట్లో కనీసం గుక్కెడు మంచినీళ్లు లేవు. మందులు లేవు, డాక్టర్‌ వచ్చే పరిస్థితి లేదు. అర్ధరాత్రి నేను నీళ్లు తీసుకు రావలసి వచ్చేది. వరసగా వారం రోజులు నా భార్య ఎటువంటి వైద్యం లేకుండా గడపవలసి వచ్చింది. ఎందుకంటే, డాక్టరెవరూ పొట్టమీద పాకుతూ రావడానికి ఇష్టపడరు కదా..''
    (గుడ్డి వాడు దేకాల్సిన వైనం .... మరికొన్ని దారుణాలు)
    ''.... కహర్‌ చంద్‌ గత 20 సంవత్సరాలుగా గుడ్డి వాడు. అతడిని దేకించారు, చితక తన్నారు. ....అసలు కొరడా దెబ్బల శిక్షల్ని ఎందుకు అమలు జరిపేవారో అర్ధం కాదు. ...(ఆరుగురు) పిల్లల్ని కొరడాలతో కొట్టించారు.... ప్రతీ ఒక్కర్నీ టిక్‌టికీ(త్రికోణం)కి బంధించేవారు, 30 కొరడా దెబ్బల్ని కొట్టేవారు. వారిలో సుందర్‌ సింగ్‌ అనే వ్యక్తి '...4వ కొరడా దెబ్బకే స్పృహ తప్పాడు, కానీ, అతడి నోట్లో ఒక సైనికుడి చేత నీళ్లు చిలకరించిన తర్వాత స్పృహ వచ్చింది. అప్పుడు కొరడా దెబ్బల శిక్షని కొనసాగించారు. మిగత పిల్లల్ని కూడా ఇలాగే శిక్షించారు. ఎక్కువ మంది స్పృహ తప్పారు. ...అప్పుడు వారిని పోలీసుల చేత ఈడ్పించి, ....కోట వరకూ తీసుకెళ్లారు'...''
గోడల మీద ఈ బుల్లెట్ గుర్తులు డయ్యర్ పైశాచికత్వానికి సాక్షాలు
    జనరల్‌ డయ్యర్‌ అకృత్యాలని దీటుగా ఘోరాలకు పాల్పడిన ఆంగ్లేయ అధికారులు ఆ కాలంలో ఎందరో...
    కసూర్‌లో రైల్‌ స్టేషన్‌ దగ్గర 150మంది పట్టే ఇనప బోనుని నిర్మించి, భారతీయుల్ని అందులో నిర్బంధించేవారు. ఒక్కోసారి అనుమానితుల్ని బట్టలూడదీసి, నగ్నంగా మార్చి,  బహిరంగంగా బంధించి, కొరడాలతో కొట్టించేవారు. ఈ శిక్షల్ని చూసేందుకు ఆంగ్లేయ అధికారులు వేశ్యలని రప్పించేవారు. పొట్టతో దేకే శిక్షల్ని మించి, కసూర్‌లో కొన్ని చోట్ల నుదురు నేలకి రాస్తూ పాకాల్సిన శిక్షల్ని సైతం విధించే వారు.
    గుజ్రన్‌ వాలాలో, హఫీజాబాద్‌లో ఇరుకు గదుల్లో, గూడ్సు బళ్లలో లెక్కకు మించిన జనాన్ని, రోజుల తరబడి నిర్బంధించి, మలమూత్రాలు అక్కడే విసర్జించాల్సిన పరిస్థితి కల్పించడం జరిగింది. స్త్రీల వస్త్రాల్ని తొలగించిన సంఘటనలు, అవమానించిన సంఘటనలు జరిగాయి. చిన్న పిల్లల్ని చిత్రహింసలు పెట్టిన సంఘటనలు జరిగాయి.
    చివరికి మైకేల్‌ ఓ. డయ్యర్‌ పరిపాలనలో పంజాబ్‌లో విమానాలనుంచి గ్రామీణ ప్రజల మీద బాంబులు వేయించిన దారుణాలు సైతం జరిగాయి. యుద్ధ సమయాల్లో  శత్రు దేశాలతో వ్యవహరించినట్టు తన పరిపాలనలో ఉన్న ప్రజల్ని మరతుపాకులతో కాల్పించడం, బాంబులతో భస్మీపటలం చేయడం మైకేల్‌ ఓ. డయ్యర్‌ వంటి సైకోపాత్‌కే చెల్లుతుంది.
    పంజాబులో సాగుతున్న దురంతాలు చాలా కాలం దేశంలో తెలియలేదు.  8 నెలల తర్వాత క్రమక్రమంగా ఈ దారుణాలు దృష్టికి వచ్చినపుడు దేశ ప్రజలు దిగ్భ్రాంతికి, అవమానానికి లోనయ్యారు.
    ఈ దమన కాండ కంటే ప్రజల్ని ఎక్కువ బాధకి గురి చేసినది - డయ్యర్‌ ద్వయానికి బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన సమర్ధన.
    ప్రభుత్వం బాధిత ప్రజలమీదే కేసులు పెట్టింది. వందల సంఖ్యలో విచారణలు, మరణశిక్షలు, యావజ్జీవ శిక్షలు, జైలు శిక్షలు విధించారు.
    జలియన్‌ వాలాబాగ్‌ హంతకులకి ఏ శిక్షలు లేవు, డయ్యర్‌ ద్వయాన్ని పదవులనుంచి తొలగించలేదు.
    తాము చేసిన పాపాల పట్ల డయ్యర్‌ ద్వయం ఏనాడూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయలేదు. 1919 చివర్లో ఒకసారి అమృతసర్‌ నించి ఢిల్లీ ప్రయాణించే ట్రైన్‌లో జనరల్‌ డయ్యర్‌ స్వయంగా తన సహచర ఆంగ్లేయ సైనికాధికారుల ముందు దురంహంకార పూరితంగా తన చర్యల గొప్పదనాన్ని చాటుకుంటూ, భారతీయ ఉద్యమకారుల గురించి అవమానకరంగా మాట్లాడటం జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రత్యక్షంగా చూశారు. తన 'ఆత్మకధ'లో ఆయన ఆ సంఘటనని ఆవేదనతో ప్రస్తావించారు.
    లండన్‌లో హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ లో జరిగిన చర్చలో జనరల్‌ డయ్యర్‌ను హీరోగా ప్రస్తుతిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. కొందరు ఆంగ్లేయులు విమర్శించినా, భారతదేశంలో బ్రిటిష్‌ అధికారాన్ని కాపాడిన వీరుడు డయ్యరేనని బ్రిటన్‌లో అత్యధికులు అతడిని గౌరవించారు. సన్మాన సభలో అతడికి 'పంజాబ్‌ రక్షకుడు' అని అక్షరాలు చెక్కిన వజ్రాలు పొదిగిన ఒక కత్తిని, 28,000 పౌండ్ల సొమ్ముని బహూకరించారు. ఆంగ్ల పత్రికలు, ఆంగ్లో ఇండియన్‌ పత్రికలు డయ్యర్‌ని పొగిడాయి.
    భారతీయులు దీనికి పుండు మీద కారం రాసినట్టుగా ఖేదపడ్డారు.
    హంటర్‌ కమిషన్‌ సభ్యులు జలియన్‌ వాలా బాగ్‌ దురంతాలపై ఏకాభిప్రాయ నివేదికని ఇవ్వలేక పోయారు. మెజారిటీ సభ్యులు డయ్యర్‌ చర్యలను సమర్ధిస్తే, భారతీయ ప్రతినిధులు ఇచ్చిన మైనారిటీ సభ్యుల రిపోర్టు డయ్యర్‌ ద్వయం చర్యలను  సుతిమెత్తగా విమర్శించింది. కాంగ్రెస్‌ నియమించిన సబ్‌ కమిటీ ధైర్యంగా గాంధీజీ నేతృత్వంలో వాస్తవాలను వెలుగులోకి తెచ్చింది.
    జలియన్‌ వాలాబాగ్‌ మారణకాండ, అనంతర కాలంలో పంజాబ్‌లో జరిగిన అకృత్యాలు యావత్తు జాతినీ చలింపచేశాయి. ఈ ఘటనలు మన జాతీయోద్యమాన్ని బలంగా ప్రభావితం చేశాయి. బ్రిటిష్‌ పాలన పైన భ్రమలున్న మితవాద వర్గంలో అధికులు తమ అభిప్రాయాల్ని మార్చుకున్నారు.
    పరాయిపాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడమొక్కటే పరిష్కారమని భారతీయ నాయకులు నిర్ధారణకి వచ్చారు. విశ్వకవి రవీంద్ర నాధ టాగోర్‌ ఈ దురంతాలకి నిరసనగా 'నైట్‌ హుడ్‌' బిరుదును తిరిగి ఇచ్చేశారు.                    
    జలియన్‌ వాలా బాగ్‌లో చిందిన రక్తం తదనంతరం ఎందరో దేశభక్తులకు స్ఫూర్తిని ప్రేరణని ఇచ్చింది. బాల భగత్‌ సింగ్‌ జలియన్‌వాలా బాగ్‌ను దర్శించి, రక్తంతో తడిసిన గుప్పెడు మట్టిని తెచ్చుకున్నాడు. 23 సంవత్సరాల వయసులోనే ఉరికంబాన్ని ఎక్కగలిగిన ధీరుడిగా, అచంచల దేశభక్తుడిగా అతడిని మలచిన స్ఫూర్తి ఆ నెత్తుటి మట్టిదే.
    1919 ఏప్రిల్‌ 13 అనంతరం మానసికంగా దేశం బ్రిటిష్‌ దాస్యాన్నుంచి విముక్తయింది. భౌతిక స్వాతంత్య్రం దాని నుంచి ఏర్పడిన సహజ పరిణామమే.
    జలియన్‌ వాలా బాగ్‌ దురంతం, - బ్రిటిష్‌ పాలననుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు, మహత్తరమైన అహింసాయుత ఉద్యమాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పాన్ని - గాంధీజీకి కలిగించింది. తదనంతర కాలంలో ఉవ్వెత్తున ఎగసిన సహాయనిరాకరణోద్యమం ఆ సంకల్ప ఫలమే.
    21 సంవత్సరాల తర్వాత....        
    మార్చి 13, 1940. సా. 4గం. 30ని.ల సమయం. 
    లండన్‌ లోని కాక్స్‌టన్‌ హాలులో రాయల్‌ సెంట్రల్‌ ఏసియన్‌ సొసైటీ, ఈస్టిండియా అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన సభ జరుగుతోంది.
    కిక్కిరిసిన జనంతో హాలు నిండిపోయింది. ఆనాటి సభకి ముఖ్య అతిధి అత్యంత ప్రముఖుడు - మైకేల్‌ ఓ. డయ్యర్‌.
    మైకేల్‌ ఓ. డయ్యర్‌ ప్రసంగం ముగిశాక, సభ మధ్యలో కొన్ని నిముషాలు విశ్రాంతి సమయం వచ్చింది.
    అందరూ లేచి కబుర్లు చెప్పుకుంటుంటే, ...అప్పటి వరకూ సభలో ముందు వరుసలో కూర్చున్న ఒక భారతీయ యువకుడు ...నెమ్మదిగా ...తన సీట్లోంచి లేచి నిలబడ్డాడు. సూటిగా ఓ. డయ్యర్‌ వైపు నడుచుకుంటూ వెళ్లాడు.
    అందరూ గమనించే లోపే అతడు ఓ. డయ్యర్‌ను చేరుకున్నాడు.   
    హటాత్తుగా తనముందు వచ్చి నిలబడిన యువకుడిని చూసి మైకేల్‌ ఓ. డయ్యర్‌ ఆశ్చర్య పడ్డాడు. ఆ యువకుడికి.....  ఓ. డయ్యర్‌కి.... మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది.
    దృఢంగా ఎత్తుగా ఉన్న ఆ యువకుడి ఆహార్యం, గడ్డం చూడగానే పంజాబీ అని అర్ధం అవుతోంది. అతడి ముఖం నిశ్చలంగా, భావరహితంగా ఉంది. అతడి కళ్లు కనిపించీ కనిపించని తడితో మెరుస్తున్నాయి.
    మైకేల్‌ ఒ. డయ్యర్‌కి అతడెవరో..., తన ముందు ఎందుకు నిలబడ్డాడో ...అర్ధం కాలేదు. ఆలోచించేంత అవకాశం కూడా అతడివ్వలేదు.
    ఓ. డయ్యర్‌ ముందు నిలబడిన క్షణమే, పక్క జేబులోంచి చెయ్యి తీశాడు. ఇప్పుడతని చేతిలో నల్లని పిస్తోలు ఉంది. .......మైకేల్‌ ఓ. డయ్యర్‌కి అర్ధమైనట్టు అనిపించింది... అతడి గొంతు తడారి పోయింది...... అంతా కేవలం ఒక లిప్త ....
    పిస్తోలు నిప్పులు కక్కింది..... మైకేల్‌ ఒ. డయ్యర్‌ రక్తం మడుగులో కుప్పకూలాడు.  ఆ యువకుడు పెద్ద పెట్టున నినదించాడు...
    ......... ''భారత్‌ మాతాకీ జై'' ......
    ......... ''ఇంక్విలాబ్‌ జిందాబాద్‌'' .......
    ........ ''భారత్‌ మాతాకీ జై'' ......
    యువకుడి చేతిలో పిస్తోలు నిప్పులు కక్కుతూనే ఉంది.
    అతడి గుండె పట్టరాని ఉద్వేగంతో ఎగసిపడుతోంది ......అతడి కళ్లు అశ్రువులు వర్షిస్తున్నాయి.... తాను విద్యార్ధిగా ఉన్నపుడు చూసిన దృశ్యం...... విశాలమైన మృత్యు మైదానం.... తన వాళ్లని జంతువుల మాదిరిగా వేటాడుతున్న ఆంగ్లేయ అహంకారం.... నేలని అలికిన నెత్తురు ..... కాళ్ల కింద నలిగిన శిశువులు..... ఛిద్రమైన సజీవ మాంస శకలాలను కుక్కలు పీకుతున్న దృశ్యం... నేలమీద పొట్టని ఆనించి... తలమీద... రైఫిల్‌ మడమ దెబ్బలు తింటూ... దుమ్ములో.... దేకిన అవమానంతో కార్చిన కన్నీరు....
    21సంవత్సరాలుగా అతడు ఏడ్వలేదు..... ఇప్పుడు మనసులో పట్టరాని ఉద్వేగమేదో .... ఊపేస్తూ .......చెంపమీద కన్నీరుగా ప్రవహిస్తూంది.....
    అతడి పేరు ఉద్ధం సింగ్‌.
    21 సంవత్సరాలు అతడి నరాల్లో లావా మరిగింది.... తన జాతికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోలేనేమోనని ఎన్ని రాత్రులు కుమిలిపోయాడో... పంజాబ్‌ దురంతాలకి ప్రతీకారం చేసి తీరవలసిందేనని.... నిశ్చయించుకున్నాక ... డయ్యర్ల రక్తం కళ్ల చూస్తానని ప్రతిఙ్ఞ చేశాక...  పగబట్టిన తాచులా వెదికాడు డయ్యర్లని. వాళ్లు భారత్‌ వదిలి ఇంగ్లడు వచ్చేశారని తెలిసి, ఉన్నత విద్య నెపంతో కుటుంబాన్ని ఒప్పించి, 'ఆశయ సాధన' కోసం తానూ ఇంగ్లండు చేరుకున్నాడు.... ఇంగ్లండు చేరినప్పటి నుంచి 3సంవత్సరాలుగా వెయ్యి కళ్లతో వెదికాడు .......డయ్యర్ల ఆచూకీ కోసం.  ఆశయ సాధనకి అవసరమైన సాధనాలను సమకూర్చుకున్నాడు.... మైకేల్‌ ఒ. డయ్యర్‌ సభ విషయం తెలియగానే తన ఆశయం తీరే అవకాశం వచ్చిందని పొంగిపోయాడు...
    రక్తపు మడుగులో కూలిపోయిన డయ్యర్‌ని చూస్తుంటే.... ఉద్ధం సింగ్‌ మనసులో కట్టలు తెంచుకున్న ఆలోచనలు.... ఉద్వేగాలు ఎన్నెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ...వేల మంది మరణాలకి, .....మరణ వేదనలకి, ....అత్యాచారాలకి, ....అవమానాలకి ....ప్రతీకారం తీర్చుకోగలిగాడు తను.... ఇంక తానేమైపోయినా పరవాలేదని అనిపించింది... ఉద్ధంసింగ్‌కి.
    మైకేల్‌ ఒ. డయ్యర్‌ నెత్తుటి మడుగులో కూలిపోగానే సభ అంతా పెద్దపెట్టున కలకలం రేగింది. ఆంగ్లేయులు ఏం జరుగుతుందో తెలీని భయంతో పరుగులు తీశారు.  ఓ. డయ్యర్‌ పక్కనే నిలబడిన మరో అతిధి లార్డ్‌ జెట్‌లాండ్‌ కూడా గాయపడ్డాడు. ....తోసుకుంటూ హాలు బయటికి పరుగెత్తుతున్న వాళ్లు '....యాన్‌ ఇండియన్‌ కిల్డ్‌ మైకేల్‌ డయ్యర్‌.....' అని వీధిలో ఎదురొచ్చిన వారికి అరిచి చెప్పారు. కొందరు భయంతో మూర్ఛిల్లారు. కొందరు టేబుళ్ల కింద దాగారు.
    పట్టుబడిన ఉద్ధం సింగ్‌ని పేరేమిటని అడిగినపుడు, తన పేరు 'రాం మహమ్మద్‌సింగ్‌ అజాద్‌' అని చెప్పి ఆంగ్ల పోలీసుల్ని ఆశ్యర్యపరిచాడు. తన దేశంలోని మూడు మతాలను, వారి మధ్య సమైక్యతతో తాను సాధించ దలచిన ఆశయాన్ని ప్రతిబింబించేలా ఉద్ధం సింగ్‌ తనకు తానే ఆ పేరు పెట్టుకున్నాడు.
ఉద్దం సింగ్
    ఆంగ్ల పోలీసుల చిత్రహింసల్ని నవ్వుతూ భరించాడు. 1940 జూలై 30న ఉద్ధంసింగ్‌ని లండన్‌ జైల్లో ఉరి తీశారు.
    కోర్టులో తన చర్యని ధైర్యంగా సమర్ధించుకున్నాడు ఉద్ధం సింగ్‌.
    ''అతడు (మైకేల్‌ ఒ. డయ్యర్‌) దీనికి (చావుకి) అర్హుడే. అతడే నిజమైన దోషి. అతడు నా జాతి చైతన్యాన్ని తొక్కేసి అణచెయ్యాలనుకున్నాడు..... నా మాతృభూమి కోసం మరణించడం కంటే గొప్ప గౌరవం నాకింకేముంటుంది?....'' అని ప్రకటించిన  వీరుడు, కణం కణంలోనూ నిరుపమాన దేశ భక్తిని నింపుకున్న జ్వాల - ఉద్ధం సింగ్‌. 
    దశాబ్దాలుగా పంజాబ్‌ బిడ్డలకి తల్లులు ఉద్ధం సింగ్‌ కధని చెపుతూనే ఉన్నారు. మిలియన్లమంది  భారతీయ యువజనం ఇతడి దేశభక్తినుంచి స్ఫూర్తి పొందుతూనే ఉన్నారు.               
               @@@@@@
    ఎపుడైనా అమృతసర్‌ వెళ్లినపుడు మీరు తప్పని సరిగా 'జలియన్‌ వాలా బాగ్‌' దర్శించండి.
    గోడమీద కనిపించే బుల్లెట్‌ గాయాల్ని, ఒక మహత్తర జాతిని నిద్ర లేపిన నెత్తుటిపాటని అనుభవంలోకి తెచ్చుకొండి.
           
           
   
   
   
   


   

5 కామెంట్‌లు:

PALERU చెప్పారు...

ఏడుపొస్తుంది...ఆ సంఘటన తలచుకుంటుంటే......

నాకు తెలీలేదు నీను ఏడుస్తున్నానని...అంతలా కదిలించింది మీ రచనా ...

మీ ఈ దేశ సేవకు నా జోహార్లు...నీను మీతో ఉంటాను.....దేశసేవ చేస్తాను,,,,

మీ అభిమాని,
RAAFSUN

జైభారత్ చెప్పారు...

చాల థాంక్స్ బ్రదర్ మీ స్పందనని తెలిపినందుకు...మీ మెయిల్ అలాగే పోస్టల్ అడ్రెస్ ఇవ్వగలిగితే స్వతంత్ర భారత పోరాట యోధుల చరిత్ర మరియు ఇంకొంత సమాచారం ఇవ్వగలను...

PALERU చెప్పారు...

బ్రదర్ దేశ సేవ చేయడం కంటే ఎక్కువ ఆనందం ఏమి ఉంటుంది మీ అడుగు జాడల్లో నడవాడానికి ప్రయత్నిస్తాను.

నా mail id : ameer.raafsun@hotmail.com
my adress:
AMEER
correspondent
RAAFSUN BLUE PUBLIC SCHOOL
KAZA POST MOVVA MANDAL
KRISHNA DIST A.P. 521150

ప్రస్తుతానికి నేను వేదేశాల్లో ఉన్నాను త్వరలో ఇండియా వస్తాను...

శ్రేయోభిలాషి
అమీర్

PALERU చెప్పారు...

బ్రదర్ దేశ సేవ చేయడం కంటే ఎక్కువ ఆనందం ఏమి ఉంటుంది మీ అడుగు జాడల్లో నడవాడానికి ప్రయత్నిస్తాను.

నా mail id : ameer.raafsun@hotmail.com
my adress:
AMEER
correspondent
RAAFSUN BLUE PUBLIC SCHOOL
KAZA POST MOVVA MANDAL
KRISHNA DIST A.P. 521150

ప్రస్తుతానికి నేను వేదేశాల్లో ఉన్నాను త్వరలో ఇండియా వస్తాను...

శ్రేయోభిలాషి
అమీర్

జైభారత్ చెప్పారు...

నా అడుగుజాడల్లో అని అంత పెద్ద మాట ఎందుకు బ్రదర్ ... తప్పకుండ మన దేశం కోసం సమసమాజం కోసం కలిసి పనిచేద్దాం.... మీరు హైదరా బాద్ వచ్చాక ఈ సెల్ 9849995538 కాల్ చేయండి కలుద్దాం. ఈ లింక్ చుడండి. http://www.facebook.com/loknath.kovuru?ref=tn_tnmn
మీ
శ్రేయోబిలాషి,
లోకనాథ్
జైభారత్.